న్యూస్4అజ్: విశాఖప్నటం: విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా మనీష్‌కుమార్ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ ఆర్కే మీనాకు రాష్ట్ర పోలీసు కార్యాలయానికి బదిలీ అయింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2000 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సిన్హా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు దిల్లీలోని సీబీఐ విభాగంలో డీఐజీ స్థాయి అధికారిగా పలు కేసుల విచారణలో కీలక భూమిక పోషించారు. గతంలో సీబీఐ డైరెక్టర్ అవినీతికి సంబంధించిన కేసులో ఈయన విచారణాధికారిగా దేశవ్యాప్తంగా సుపరిచితులయ్యారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉంటారని పేరు తెచ్చుకున్నారు. పని చేసిన అన్ని విభాగాల్లోను సమర్థవంతమైన పోలీసు అధికారిగా పేరొందారు.
1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీపీ ఆర్కే మీనా విశాఖ సీపీగా బాధ్యతలు చేపట్టి ఏడాదయింది. 2019 జూన్‌లో ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే అదనపు డీజీగా పదోన్నతి లభించింది. రహదారి ప్రమాదాల నివారణ, ఆస్తి నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పర్యవేక్షణలో తనదైన ముద్ర చూపారు. భూతగాదాల్లో పోలీసుల ప్రమేయం లేకుండా చేయటంలో విజయవంతమయ్యారు. నగరంలో గుట్కా తయారీ కేంద్రాలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. 133 ద్విచక్రవాహనాల దొంగతనం కేసు… సింహాచలం వద్ద కిడ్నాప్, 60 కార్ల చోరీ, దొంగనోట్లు…పిల్లల అక్రమ రవాణా తదితర సంచలన కేసులను సీపీ స్వయంగా పర్యవేక్షించారు. ఆ కేసులను ఛేదించటంలో సఫలీకృతులయ్యారు.
నగరంలో శిరస్త్రాణం ధరించే వారి శాతం గణనీయంగా పెంచారు. గత సంవత్సరంగా నగరంలో 642 సీసీ కెమెరాలను అమర్చి ప్రజల భద్రతపై దృష్టిసారించారు. కొవిడ్ -19 నియంత్రణ చర్యలనూ పకడ్బందీగా తీసుకున్నారు. పోలీసు సిబ్బందిని ఆ దిశగా కార్యోన్ముఖులను చేశారు. రహదారి ప్రమాదాల నియంత్రణలో తనదైన ముద్ర చూపారు. నగర కమిషనరేట్ పరిధిలో తీవ్రమైన రహదారి ప్రమాదాలు 27 శాతం తగ్గుముఖం పట్టగా, సాధారణ ప్రమాదాలు 16 శాతం తగ్గాయి.
‘సృష్టి’ ఆసుపత్రి కేంద్రంగా జరిగిన పిల్లల అక్రమ రవాణా కేసును సీపీ సవాల్‌గా తీసుకుని దర్యాప్తు సాగించారు. కొందరు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు వేగిరం చేశారు.
