కరోనా వ్యాక్సిన్ ను అన్ని దేశాలకు పంపేందుకు రెడీ అవుతున్న W.H.O

న్యూస్4అజ్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాధ్యతలు విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు తయారు చేయడానికి అందరూ విశ్వప్రయత్నం చేస్తున్నారు. కరోనాని అంతమొందించేందుకు ఇప్పటివరకు165 వ్యాక్సిన్ల పోటీలో ఉన్నాయి. అయితే 165 వ్యాక్సిన్లలో కేవలం ఒకటి లేదా రెండు వ్యాక్సిన్లు మాత్రమే ట్రైల్స్ లలో సమర్థవంతమైనవిగా గుర్తించబడతాయని తెలుస్తోంది. మిగతా అన్ని వ్యాక్సిన్లు కూడా నిరుపయోగంగా మారుతాయని ఇప్పటికే విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే అభివృద్ధి చెందిన దేశాలు ముందస్తుగానే బాగా పేరుగాంచిన పరిశోధకుల వ్యాక్సిన్లను కోట్ల సంఖ్యలో ఆర్డర్ చేసుకున్నారు.దీంతో ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యమని స్పష్టమవుతుంది. ఒకవేళ అవి వెనుకబడిన దేశాల్లో అడుగుపెట్టినప్పటీ.. వ్యాక్సిన్ పేదప్రజల వద్దకు వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలా జరగకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి నుండే అనేక ప్రణాళికలు రూపొందించుకుంటోంది. 2021వ సంవత్సరం లోపు రెండు బిలియన్ల వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుంబిగించింది. కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కొరకై రూపొందిస్తున్న ప్రణాళిక ఆగస్టు 31వ తేదీ లోపు పూర్తవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ప్రపంచంలో కొవిడ్-19 వ్యాధి నిర్మూలన కొరకై తయారైన వేగవంతమైన టెస్టింగ్ కిట్స్, సమర్థవంతమైన మాస్క్ లను, హ్యాండ్ శానిటైజర్లను వైద్య పరికరాలను, మందులను కూడా కొవాక్స్ ప్రోగ్రాం ద్వారా అన్ని దేశాలకు పంపించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందడుగు వేస్తుంది. అయితే 92 వెనుకబడిన దేశాలు తమ ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కి డబ్బులను సమకూర్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తేవాలని ధనిక దేశాలను కూడా కొద్దో గొప్పో ఆర్థిక సహాయం చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *