న్యూస్4అజ్: విశాఖపట్నం: విశాఖ నగరంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. గతానికి భిన్నంగా వ్యవహరించారు. దొంగలు దుస్తులు తీసేసి నగ్నంగా ఇళ్లలోకి దూరిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ దిశగా దర్యాప్తు మొదలెట్టారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మర్రిపాలెం వుడా లేఅవుట్ లో వ్యాపారి వడ్డాది త్రినాథరావు, భార్య గౌరి, కుటుంబసభ్యులతో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్ర పోయారు. తెల్లవారుజామున ౩ గంటల సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి తలుపులు, కిటికీలు పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడ్డారని, బీరువాలోని రూ. 20 వేల సొత్తుతో పాటు సెల్ ఫోన్ తస్కరించాడని కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే సమయంలో ఆ ప్రాంతంలోని మరికొన్ని ఇళ్లలోకి కూడా దొంగలు చొరబడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచిత్రమేమిటంటే ఓఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్ని పరిశీలిస్తే ఓ వ్యక్తి తన దుస్తులు విప్పేసి, నగ్నంగానే ఇంట్లోకి చొరబడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తమ విచారణలో ఆ వ్యక్తి సైకోగా తేలిందని, విచారణచేపట్టామని క్రైం ఎస్ఇ మన్మథరావు చెబుతున్నారు.మరోవైపు ఇంట్లో ఉదయంలేచి చూసేసరికి, చిందరవందరగా ఉందని, సొత్తేమీ పోకపోయినా తమకు మాత్రం ఆ ప్రాంతంలో భద్రత కరువైందని యజమానులు వాపోతున్నారు. ఇంటి వెనుక గోడ దూకేసి బయటకు వెళ్లిపోవడాన్ని తాము గుర్తించామని, తమకు మెలకువ వచ్చి చూసేసరికి చప్పుడై, అప్రమత్తమై పారిపోయి నట్టుగా డయల్ 100కు కూడా బాధితులు ఫోన్ చేసి సమాచారం అంద జేశారు. కొత్త దొంగల ఆచూకీపై పరిశీలిస్తున్నామని ఇన్ స్పెక్టర్ సత్యనా రాయణ చెప్పారు. యజమానులు కూడా ఫిర్యాదు ఇవ్వాలని చెప్పగా.. మళ్లీ ఏమీ పోలేదని చెబుతున్నారని, అయినప్పటికీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
