కేసియార్ ఆరోపణలు అవాస్తవం..కిషన్ రెడ్డి..

న్యూస్4అజ్: శాసనసభ వేదికగా కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పుడు ఆరోపణలు చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వివక్షతో కాకుండా విచక్షణతో పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం మీదికి నెట్టడం సరికాదన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. సచివాలయం కూల్చివేతపై పెట్టిన శ్రద్ధ.. కరోనా నివారణపై పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. మజ్లిస్‌ మెప్పు కోసం ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. పారాసిటమాల్‌తో కరోనా పోతుందని మాట్లాడిన కేసీఆర్‌కి కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.తెలంగాణకు కేంద్రం 1400 వెంటిలేటర్లు ఇస్తే ఇప్పటివరకు 500 వెంటిలేటర్లకు సీల్‌ కూడా తీయలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 13.85లక్షల ఎన్‌-95 కిట్లు, 2.41లక్షల పీపీఈ కిట్లు, 42లక్షల హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఉచిత బియ్యం, ఉపాధి హామీ పనిదినాల పెంపు, 52 లక్షల మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు జమ, రైతు సమ్మాన్‌ నిధి కింద 32 లక్షల మంది తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.666 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు. సీఎం కేసీఆర్‌ పనికిరాని పథకం అంటున్న ఆయుష్మాన్‌ భారత్‌ను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. పనికొచ్చే ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యాన్ని ఎందుకు చేర్చలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే విద్యుత్‌ చట్టంతో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైనా ఉచిత విద్యుత్‌ ఇచ్చుకోవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *