సెల్ఫీ దిగుతూ అట్లాంటా వాటర్ ఫాల్స్ లో తెలుగు యువతి బలి…

న్యూస్4అజ్: సెల్ఫీ సరదా మరో నిండుప్రాణాన్ని బలి తీసుకొంది. ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కూతురిని జల రక్కసి యువతి నూరేళ్ళ జీవితాన్ని మింగేయటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్‌ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు.అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్‌ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలోని పెద్దకుమార్తె వద్దకు వెళ్లిన తల్లితండ్రులు విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే కమల ఇక లేదన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు జీర్ణించుకోలేకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *