న్యూస్4అజ్:
- ఉదయం 6 తర్వాతే మళ్లీ ఓపెన్
- వీకెండ్స్‌లో పర్యాటకులకు మాత్రమే అనుమతి
- వేగ పరిమితి గంటకు 35 కిలోమీటర్లు
- బ్రిడ్జికి రెండు వైపులా పార్కింగ్ కోసం ఏర్పాట్లు
- భారీ వాహనాలకు అనుమతి లేదు
- సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్
: జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ కనెక్టివిటీలో భాగంగా దుర్గం చెరువుపై అందుబాటులోకి వచ్చిన కేబుల్ బ్రిడ్జిపై ప్రతిరోజు రాత్రి 11 దాటితే వాహనాలకు అనుమతి ఉండదని, మరుసటి రోజు ఉద యం 6 గంటల వరకు మూసివేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వంతెనను మూసివేస్తామన్నారు.
ఆ రోజుల్లో కేవలం పర్యాటకులకు మాత్రమే అనుమతించే విధంగా జీహెచ్ఎంసీ ప్రణాళికలు చేసిందని వివరించారు. దుర్గం చెరువు బ్రిడ్జి పరిసరాల్లో అమలు చేసే ట్రాఫిక్ ఆంక్షలను డీసీపీ వివరించారు.
ఆంక్షలు ఇలా..
- ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు బ్రిడ్జి మూసి ఉంటుంది.
- మిగతా రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. ఇది వాహనదారులకు, పాదచారులకు వర్తిస్తుంది.
- వాహనాల రాకపోకలు ఉన్న సమయంలో ప్రధాన రహదారుల్లో పాదచారులు, బ్రిడ్జిపై రోడ్డు క్రాసింగ్, వంతెన ఇరువైపులా, రేలింగ్ వైపు నిల్చోవడం, వాహనాలు పార్కింగ్ చేయడం, పుట్టిన రోజు వేడుకలు, మద్యం సేవించడం లాంటి వాటికి అనుమతి లేదు.
- వారాంతంలో దుర్గం చెరువు నుంచి మాదాపూర్, రోడ్డు నం.45 వెళ్లే రోడ్లు మూసేస్తారు. అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.
- బ్రిడ్జికి రెండు వైపులా పరిమితమైన వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, ఐటీసీ కోహినూర్ వెనుక వైపు, రోడ్డు నం. 45 కేబుల్ బ్రిడ్జి కింద, మస్తాన్నగర్ కేబుల్ బ్రిడ్జి కింద, రోడ్డు నం. 45 నుంచి పై వంతెనకు ఎడమ వైపు తాత్కాలిక మీడియన్లతో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
- దుర్గం చెరువు బ్రిడ్జిని గచ్చిబౌలి, నార్సింగి, మియాపూర్, మాదాపూర్, కూకట్పల్లి వైపు నుంచి వచ్చే వాహనాదారులు మైండ్ స్పేస్ రోటరీ మీదుగా వెళ్లాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలు రోడ్డు నం.45 మీదుగా దుర్గం వంతెన వద్దకు చేరుకోవాలి.
- బ్రిడ్జి వద్దకు వచ్చే వారు తమ వాహనాలకు కేటాయించిన స్థలాల్లోనే పా ర్కింగ్ చేసుకోవాలి. రోడ్లపై పా ర్కింగ్ చేసి ఇతర వాహనాలకు ఇబ్బందులు కలిగించి.. ట్రాఫిక్ సమస్యకు కారకులు కావొద్దు. అలా చేస్తే రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి తరలిస్తారు.
- బ్రిడ్జి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతున్నది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తారు.
- భారీ వాహనాలైన ట్రాక్టర్స్, డీసీఎం, గూడ్స్ ఆటోలు, జేసీబీలు, క్రేన్, ట్రక్ ఇతరత్రా వాహనాలకు బ్రిడ్జిపైకి అనుమతి లేదు. వీటితో పాటు తోపుడుబండ్లు, ఎండ్ల బండ్లకు కూడా అనుమతి లేదు.
బ్రిడ్జిపై వేగం గంటకు 35 కిలోమీటర్లు మాత్రమే
బ్రిడ్జిపైకి వచ్చే వారు నియమ నిబంధనలు పాటించాలి. పిల్లలు వంతెనపై వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వంతెన వద్దకు వచ్చే సమయంలో తమ వెంట విలువైన వస్తువులు, ఆభరణాలు ధరించి రావొద్దు. రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.