తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం…జర జాగ్రత్త…

న్యూస్4అజ్: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి ఇవాళ, రేపు (ఆదివారం, సోమవారం) భారీ వర్ష సూచన ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం… వాయుగుండంగా మారింది. దాని వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. వాయుగుండం 48 గంటల్లో అది పశ్చిమ దిశగా వెళ్లి బలహీనపడుతుంది. దాని ప్రభావం తెలంగాణపై బాగా కనిపిస్తోంది. అందువల్ల తెలంగాణలో కూడా ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ వారం నుంచి వానలు దంచేస్తున్నాయి. ఐతే… ఇప్పుడు పడబోయే వానలు కూడా అదే స్థాయిలో ఉంటాయనీ…భారీగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ అధికారులు.

మరో అల్పపీడనం: బంగాళాఖాతం జోరుగా ఉంది. తాజాగా అక్కడో ఆవర్తనం ఏర్పడింది. ఈ నెల 19న (సోమవారం) అది అల్పపీడనంగా మారనుంది. 20 నాటికి అది తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆదివారం, సోమవారం కురిసే వర్షాలకు అది కారణం కాబోతోంది. అందుకే… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరీ మరీ అధికారులు కోరుతున్నారు.

తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే:
హైదరాబాద్‌లో మొన్న పడిన వర్షాలు అంత భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తాయని ఎవరూ ఊహించలేదు. వాటికి తోడు… రాత్రంతా కుండపోత వాన కురిసింది. ఫలితంగా లోతైన ప్రాంతాల్లో ఉన్న వాన నీటికి మరింత వరద నీరు తోడైంది. చాలా కాలనీల్లో వరద నీరు అలాగే ఉంది. నీటిని తరలించేందుకు GHMC సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు సరిపోవట్లేదు. చాలా రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ హైవేపై మళ్లీ ట్రాఫిక్ నిలిచిపోతోంది. అటు మూసీ నుంచి భారీగా వరద నీరు హిమాయత్ సాగర్‌లో కలుస్తోంది. దాంతో అధికారులు… నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అలర్ట్ జారీ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజేంద్ర నగర్ ప్రాంతంలో… భూమిలో భారీ శబ్దాలు వచ్చాయి. బోరబండలో జరిగినట్లే… ఇక్కడా జరుగుతోందని భూగర్భ శాస్త్రవేత్తలు తేల్చారు. అది భూకంపం కాదనీ… భూమిలోకి నీరు ఇంకేటప్పుడు ఇలాగే శబ్దాలు వస్తాయని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. అటు వర్షాలు, ఇటు ఇలాంటి టెన్షన్ పరిస్థితులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

క్యుములోనింబస్ హెచ్చరికలు:ఏపీతో పోల్చితే… తెలంగాణలో కురిసే వర్షాలతో ఓ ప్రమాదం ఉంది. అదే క్యుములోనింబస్ ప్రళయం. ఈ మేఘాలు చాలా దట్టంగా ఉంటాయి. ఇవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో అతి భారీ వర్షాన్ని కురిపిస్తాయి. అందువల్ల ఈ తరహా మేఘాలతో వర్షం పడుతున్నప్పుడు… ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు వెళ్లకూడదు. ఎందుకంటే… చెట్లకు పిడుగుల్ని ఆకర్షించే గుణం ఉంటుంది. అందువల్ల వర్షం పడుతుంటే… వీలైనంతవరకూ వర్షం లోకి వెళ్లకుండా ఇళ్లలోనో, షాపుల దగ్గరో… ఎక్కడో ఓ చోట ఉండిపోవాలి. వాన నన్నేం చేస్తుందిలే అని మాత్రం లైట్ తీసుకోవద్దు అంటున్నారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *