రాహుల్‌ని వెంటనే అధ్యక్షుడిని చేయండి ◆ ఢిల్లీ కాంగ్రెస్ తీర్మానం

న్యూస్4అజ్: రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీకి వెంటనే జాతీయ అధ్యక్షుడిని చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ ఆదివారం తీర్మానం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను సోనియాగాంధీ నిర్వహిస్తున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. వాస్తవానికి అధ్యక్ష పదవిపై రాహుల్ సముఖంగా లేరని పార్టీలోని కొందరు చెప్తున్నారు. అయితే మరోపక్క రాహుల్ గాంధీనే మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తీర్మానం చేసిన అనంతరం ఢిల్లీ పీసీసీ చీఫ్ అనిల్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ కార్యకర్తలకు స్ఫూర్తి రగిలించడం రాహుల్‌కి మాత్రమే సాధ్యం. జీఎస్‌టీ మొదలుకొని వ్యవసాయ చట్టాల వరకు ఆయన చెప్పిన జోస్యాలన్నీ నిజమయ్యాయి. ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌ని ఎన్నుకోవాలని మేము తీర్మానం చేశాం’’ అని అన్నారు.ఏఐసీసీ శాశ్వత అధ్యక్ష పదవిపై కొద్ది రోజుల క్రితం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారని జూన్ తర్వాత అధ్యక్ష ఎన్నిక జరగనుందని లీకులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఆ ప్రభావం అధ్యక్ష ఎన్నికపై పడకూడదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కొందరు రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాహుల్‌కి మద్దతుగా ఢిల్లీ కాంగ్రెస్ తీర్మానం చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *