కోవిషీల్డ్ టీకాతోనే విదేశి ప్రయాణమా!!

న్యూస్4: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం మనదేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కొవాగ్జిన్ కాగా, రెండోది కొవిషీల్డ్‌. వైరస్‌పై పోరాడటంలో ఈ రెండూ సమర్థవంతమైన పనితీరు కనపరుస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. ఏ టీకా వేయించుకున్నా పర్వాలేదని చెప్పింది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం ఈ రెండు టీకాల మధ్య సారూప్యత కొరవడుతోంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కొవిషీల్డ్ ఉపయోగపడుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో కొవిషీల్డ్‌
కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ కలిసి తయారుచేశారు. పుణెలో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనదగ్గర ఉత్పత్తి చేస్తోంది.ఈ వ్యాక్సిన్‌కి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది కానీ హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తున్న కోవాగ్జిన్‌కి ప్రపంచ దేశాల్లో అంతగా గుర్తింపు రాలేదు.

విదేశాలకు వెళ్లాలనుకునేవారు భారత్ నుంచి బయలుదేరే ముందు టీకా వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్ చూపించాలి. కొవాగ్జిన్ టీకా వేయించుకున్నవారు విదేశాలకు వెళ్లే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. ఎందుకంటే… చాలా దేశాల్లో కోవాగ్జిన్‌కి అధికారికంగా ఇంకా గుర్తింపు రాలేదు. కోవిషీల్డ్.. లేదా తమ దేశంలో ఉన్న టీకాలు.. లేదా ఫైజర్ వంటి టీకాలకు తగిన గుర్తింపు ఉంది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ లో ఉన్న టీకాలు వేయించుకుంటే వివిధ దేశాలు వారిని ఆహ్వానిస్తున్నాయి. కొవిషీల్డ్, మోడెర్నా, పైజర్, ఆస్ట్రాజెనెకా, సినోఫార్మ్, జన్సెన్ (అమెరికా, నెదర్లాండ్స్) టీకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగం కింద రూపొందించిన జాబితాలో ఉన్నాయి. కొవాగ్జిన్ ఈ జాబితాలో లేదు.

జాబితాలో మా టీకా కూడా చేర్చండి
కొవాగ్జిన్‌ను కూడా ఈ జాబితాలో చేర్చమని భారత్ బయోటెక్ కోరింది. జూన్‌లో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు తెలుస్తోంది. ఈలోగా కొవాగ్జిన్‌కి సంబంధించిన అంగీకార పత్రం, నివేదికలు సమర్పిస్తే… జాబితాలో చేర్చే విషయమై నిర్ణయం తీసుకుంటామని సంస్థ చెప్పినట్లు సమాచారం. కొవాగ్జిన్ టీకాకు జరిగిన ప్రయోగాల్లో భారత ప్రభుత్వ పెట్టుబడి కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని జాబితాలో కొవాగ్జిన్ టీకా కూడా చేరేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. విదేశీ ప్రయాణ సమయంలో అనుకోని అవాంతరమెదురైతే ఇబ్బంది పడాల్సి ఉంటుందని, అటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని, భారత్ బయోటెక్ కంపెనీని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *