ఇక కోవిడ్ వ్యాక్సిన్ ల డెలివరీ డ్రోన్ల తో నట..

 • మెడిసన్స్‌ ఫ్రం స్కై పేరుతో పైలట్‌ ప్రాజెక్టు
 • డ్రోన్‌ డెలివరీ ప్రారంభించనున్న డూన్జో
 • త్వరలో ప్రారంభం కానున్న డ్రోన్‌ డెలివరీ సర్వీస్‌
 • హైదరాబాద్‌తో పాటు మరో 7 నగరాల్లో డ్రోన్‌ సేవలు
 • న్యూస్4: హైదరాబాద్‌: కొవిడ్‌ కల్లోల సమయంలో ఆక్సిజన్‌ ట్యాంకర్లకు ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. అంతకు రెండు నెలల ముందు అవయవమార్పిడి సందర్భంగా స్పీడ్‌ డెలివరీ కోసం హైదరాబాద్‌ మెట్రోలో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని మించిన వేగంతో అత్యవసర ఔషధాలు అందించే సేవలు భాగ్యనగర వాసులకు అందుబాటులోకి రాబోతున్నాయి. మెడిసిన్స్‌ ఫ్రం స్కై పేరుతో డ్రోన్ల ద్వారా మెడిసిన్స్‌ డెలివరీ చేసేందుకు డూన్జో సంస్థ అనుమతులు సాధించింది.అతి త్వరలోనే ఈ సేవలు హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సి‍న్లు, ఇతర అత్యవసర మందులు డ్రోన్ల ద్వారా ఇంటికే తెప్పించుకోవచ్చు.

  డ్రోన్‌ డెలివరీ
  వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మెడిసిన్‌ ఫ్రం స్కై పేరుతో పైలట్‌ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను డూన్జో సంస్థ అందివ్వనుంది. మెడిసిన్స్‌ ఫ్రం స్కైలో భాగంగా అత్యవసర ఔషధాలతో పాటు కొవిడ్ మెడిసన్లు, వ్యాక్సిన్లను సైతం డ్రోన్ల ద్వారా ఎంపిక చేసిన చిరునామాకు డెలివరీ చేసే వీలుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని డూన్జో తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

  మెడ్‌- ఎయిర్‌ కన్సార్టియం
  గూగూల్‌తో పాటు వైద్యరంగానికి సంబంధించిన నిపుణులతో ఏర్పాటైన మెడ్‌-ఎయిర్‌ కన్సార్టియం మెడిసిన్‌ డ్రోన్‌ డెలివరీ సిస్టమ్‌పై కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. మెడిసిన్‌ డ్రోన్‌ డెలివరీని బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌ (BVLOS)గా ప్రస్తుతం పేర్కొంటున్నారు. ఇటీవల బీవీఎల్‌ఓఎస్‌ పద్దతిలో అత్యవసర ఔషధాల డెలివరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.

  8 నగరాల్లో
  కేంద్రం నుంచి అనుమతి రావడంతో మెడ్‌-ఎయిర్‌కన్సార్టియం , డూన్జోతో కలిసి దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పూనే, గురుగ్రాం, జైపూర్‌ మొత్తం 8 నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా మెడిసిన్స్‌ ఫ్రం స్కై చేపట్టాలని నిర్ణయించాయి. మలిదశలో దేశంలోని 22 నగరాలకు ఈ సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెడిసిన్స్‌ ఆన్‌లైన్‌ డెలివరీకి డిమాండ్‌ పెరగిందని డూన్జో అంటోంది. జనవరి నుంచి మే వరకు ఔషధాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఇరవై రెండు వేల ఆర్డర్లు వచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. మెడిసిన్స్‌ డెలివరీలో 350 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని తెలిపింది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *