సంపూర్ణ లాక్డౌన్ ఎత్తివేత..ఇక అన్నీ ఓపెనే..

న్యూస్4: తెలంగాణ: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని ఈ చర్చ సందర్భంగా కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది. ఈ మేరకు, జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్ ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది.

స్వీయ నియంత్రణ మరువద్దు:
——————————-
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలన్నది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రావాలంటే, సంపూర్ణ సహకారం తప్పనిసరిగా అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

విద్యాసంస్థల ప్రారంభం:
———————-
అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్ధతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. విద్యా సంస్థలు పున: ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్ లైన్ క్లాసుల కొనసాగింపు, తదితర నిబంధనలు, విధి విధానాలకు సంబంధించిన ఆదేశాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది.

నూతనంగా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్:
—————————————-
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించిన కేబినెట్ రాష్ట్రానికి మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నూతనంగా మంజూరు చేసింది. వీటిలో చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మూడవది. టిమ్స్ ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

వ్యవసాయం:
————-
రాష్ట్రంలో గత సంవత్సరం వరిధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పైచిలుకుగా ఉందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే ఈనెలలో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువగా వర్షాపాతం నమోదయ్యిందని , వ్యవసాయ శాఖ కేబినెట్ కు వివరించింది.

గత సంవత్సరంలో పండిన వరిధాన్యంలో 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని, సొంత అవసరాలకోసం ప్రజలు ఉపయోగించుకున్నారని, మార్కెటింగ్ శాఖ వివరించింది.
ఈ వానాకాలం ఇప్పటికే రైతుబంధు పైసలు, 5145 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమయ్యాయని వ్యవసాయ శాఖ తెలిపింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడ ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి మరియు సంబంధిత శాఖల అధికారులను సిబ్బందిని, కేబినెట్ అభినందించింది.

కుల వృత్తుల సంక్షేమం:
———————–
గొర్ల పెంపకం వృత్తిలో వున్న యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసం, గతంలోనే నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను గ్రామాల్లో తక్షణమే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

చేనేత, గీత కార్మికులకు త్వరిత గతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సివున్న ఎక్స్ గ్రేషియా ను వెంటనే విడుదల చేయాలని, వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కర్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది.

రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా ప్రస్తుతం అమలలో వున్న బీమా చెల్లింపులను సత్వరమే అందేవిధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

➧ కొత్తపేట లో ప్రస్తుతం వున్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇరిగేషన్:
———-
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్.డి.ఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్ కు తెలిపింది. ఎన్.జీ.టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని, కేబినెట్ తీవ్రంగా ఖంఢించింది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి 17 సంవత్సరాలయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలయినా తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన నీటివాటా నిర్ధారణ కాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం- 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయమని విజ్జప్తి చేసింది. అయితే సుప్రీం కోర్టులో కేసు కారణంగా తాము సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను విరమిస్తే గనుక తాము త్వరగా నిర్ణయిస్తామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశం (6 అక్టోబర్ 2020 నాడు) లో స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసును విరమించుకుని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తదనే నమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వం కేసును ఉపసంహిరించుకున్న నేపథ్యంలో కేంద్రం యొక్క నిష్క్రియా పరత్వం వల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం కుదురుకోవడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టి నూతన రాష్ట్రానికి సహకారం అందించాల్సి వుంటుందని, అటువంటి చొరవ తీసుకోకుండా, బాధ్యత వహించకుండా నదీ జలాల విషయంలో అవలంబిస్తున్న, కేంద్ర నిర్లక్ష్య వైఖరి పట్ల కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని కేబినెట్ అభిప్రాయపడింది.

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వలన పాలమూరు, నలగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు హైదరాబాద్ కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరగనున్ననేపథ్యంలో న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడానికి, ఈ క్రింది నిర్ణయాలను రాష్ట్ర మంత్రి మండలి చర్చించి తీసుకున్నది.

➧ జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో బారేజీ (జోగులాంబ) ని నిర్మించి 60-70 టిఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని నిర్ణయించింది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్ కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది.

➧ పులిచింతల ఎడమ కాల్వను నిర్మాణం చేసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది.

➧ సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరొక ఎత్తిపోథల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతానికి మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది.

➧ కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతమైన కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలని నిర్ణయించింది.

➧ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని 20 టిఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

➧ నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించాలి.

➧ ఈ ప్రాజెక్టులకు సర్వేలు నిర్వహించి, డిపీఆర్ ల తయారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సాగునీటి శాఖను కేబినెట్ ఆదేశించింది.

➧ వానాకాలం లోనే నదీ జలాల లభ్యత ఎక్కువగా వుండడం చేత జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుకూలత ఏర్పడుతుందని కేబినెట్ చర్చించింది. అదే సందర్భంలో వానాకాలం ప్రాంరంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి, ఎప్పటి జలాలలను అప్పుడే ఎత్తిపోసుకునే వీలుంటుందని, ఈ నేపథ్యంలో తెలంగాణకు హక్కుగా వున్న జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తును వానాకాలం సీజన్ లోనే వీలయినంత సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసి ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలని, తద్వారా ఎత్తిపోతల పథకాలకయ్యే విద్యుత్తు ఖర్చును తగ్గించుకోగలుగుతామని కేబినెట్ అభిప్రాయపడింది.

➧ ఈనేపథ్యంలో కృష్ణా గోదావరి నదుల పై 2375 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రాజెక్టులున్నాయని, వాటి సంపూర్ణ సామర్థ్యంతో జల విద్యుత్తును ఉత్పత్తి చేసి, రాష్ట్రంలోని కాళేశ్వరం, దేవాదుల, ఎఎం ఆర్పీ తదితర లిప్టు ఇరిగేషన్ పథకాలకు నిరంతర విద్యత్తును సరఫరా చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను పరిరక్షించుకొని తెలంగాణ రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ నిర్ణయించింది. ఈ విషయంలో ప్రధాన మంత్రిని, కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించి, ఈ అక్రమ ప్రాజెక్టులను ఆపించే విధంగా చూడాలని ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో, ఆంధ్ర ప్రదేశ్ జల దోపిడీని ఎత్తిచూపి, రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి జాతికి వివరించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్ర ప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల పర్యవసానంగా కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరిగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *