ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్

లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖులు ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, హీరోలు నిఖిల్, నితిన్ వివాహం చేసుకున్నారు. తాజాగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి ప్రవళ్లికను ఆగస్టు 2న హైదరాబాద్‌లో సుజీత్ వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎలాంటి హడావుడి లేకుండా వీరి వివాహం జరిగినట్టు సమాచారం. సుజీత్-ప్రవళ్లిక మెహెందీ ఈవెంట్, వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సుజీత్, ప్రవళ్లిక గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 10న వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకను కూడా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. అయితే, పెళ్లి మాత్రం హైదరాబాద్ శివారులోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్‌లో జరిగినట్టు తెలిసింది. కాగా, ప్రవళ్లిక డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. సుజీత్, ప్రవళ్లిక జంటకు సంగీత దర్శకుడు జిబ్రాన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈయన ‘సాహో’ సినిమాకు నేపథ్య సంగీతం సమకూర్చారు.

ఇదిలా ఉంటే, 23 ఏళ్ల వయసులో సుజీత్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమా ‘రన్ రాజా రన్’తోనే మంచి విజయాన్ని అందుకున్నారు. శర్వానంద్, సీరత్ కపూర్, అడివి శేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ థ్రిల్లర్ ఇటు విమర్శకులు, అటు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక రెండో సినిమాను ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో సెట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు సుజీత్. ‘సాహో’ను భారీ చిత్రంగా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ వర్క్‌తో సుజీత్ బిజీగా ఉన్నారు. మూడో చిత్రం మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *