కరోనా పై బాలయ్య బాబు చిట్కా…

న్యూస్4అజ్: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా తరిమికొట్టే మందు, రాకుండా అడ్డుకొనే టీకా కోసం శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి భౌతిక దూరమే మనముందున్న మార్గం. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తే.. కరోనాను రాకుండా అడ్డుకోవచ్చు. ఐతే కోవిడ్ మహమ్మారి మన దగ్గరకుండా ఉండేందుకు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త చిట్కా చెప్పారు. తాను చెప్పిన మంత్రం రోజూ చదివితే కరోనాను నివారించవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం హిందూపురంలో పర్యటించారు. కరోనా ప్రభావంతో కొన్నాళ్లుగా ఆయన సొంత నియోజవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఎట్టకేలకు 5 నెలల తర్వాత హిందూపురం వెళ్లారు బాలయ్య. బాలకృష్ణ నియోజకవర్గానికి రావడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఇటీవలే హిందూపూర్ ఆసుపత్రికి రూ.55 లక్షల విలువ చేసే కొవిడ్ వైద్యపరికరాలు, మందులను బాలకృష్ణ ప్రకటించారు. సోమవారం స్వయంగా వాటిని హిందూపూర్ ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామంటూ.. లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు బాలయ్య. ఈ మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని చెప్పారు. ఐతే బాలకృష్ణ సూచనలపై సోషల్ మీడియాలో కొందరు జోకులు పేల్చుతున్నారు. మంత్రంతో కరోనాను ఎదుర్కొనడమేంటని సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,24,767 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి వీరిలో 3,21,754 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 3884 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 99,129 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36,66,422 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *